సాహితీ కిరణం పత్రికలో శ్రీమతి ముట్నూరి కమలమ్మ గారి స్మారక బహుమతి పొందిన నా కథ

Sunday, December 18, 2016

కట్టెలమ్మిన చోట...

నేను పుట్టినప్పటి నుంచే మాకు కట్టెల మండీ ఉండేది. బడికెళ్ళి ఇంటికొచ్చాక కాసేపు అడితిలో కట్టెలు తూచే తక్కెడ మీద కూచుని ఉయ్యాలలూగుతూ అమ్మ చేతి గోరుముద్దలు తినడం ఎంతో ఇష్టమైన గుర్తు. ముని రాముడు మామ (ఈయన అసలు పేరు కాదిది, ఎవరో గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడుట చిన్నప్పుడు. కాషాయ వస్త్రాలు వేసుకుని, జుట్టుని కత్తిరించకుండా పైకి మునిలా ముడివేసుకుని ఎర్రని బొట్టు పెట్టుకుని ఉండడం మూలాన ఈయన్ని ముని రాముడంటారు జనాలు) ఏవో శ్లోకాలు చెప్తుంటే వాటిని వల్లె వేయడం కూడా అంతే ఇష్టం.నేను తక్కెట్లో ఆడుకుంటుంటే నాయన నీరెండలో కుర్చీ వేసుకుని నిద్రాదేవి వడిలో ఆడుకుంటూ వ్యాపారం చేసేవాడు. ఇద్దరు కుర్రాళ్ళు పని చేసేవారు. వాళ్ళిద్దరూ గిరాకీ ఎప్పుడొచ్చినా నన్ను కాటా నించి కిందకి దింపి కట్టెలు తూకం వేసి ఇచ్చేవారు. డబ్బులు మాత్రం నీరెండలో కూర్చున్న నాయనకిమ్మని చెప్పేవారు. వర్షాకాలం వస్తుందనగా కట్టెలన్నీ తడిసి పోతాయని వెనక ఉన్న షెడ్డులోకి మార్చేవారు. ఇల్లు ఇరుకయ్యి ఉండేది దానివల్ల. మళ్ళీ సంకురాతిరొస్తుందనగా ఇంటి ముందు పేరుకునేవి. ప్రతి ఇంటిలోను కట్టెలు లేకుండా పొయ్యిలోంచి పిల్లి లేవదు కాబట్టి, మంచాలూ కుర్చీలూ చేసే వాళ్ళకి కావలసిన కలప కూడా దొరుకుదుంది కాబట్టీ  నాయన వ్యాపారం 3 దుంగలూ 6 కట్టెలు లాగా దినదినాభి వృద్ధి అయ్యింది.

మా ఇంటి చుట్టుముట్టు ఒక ఎలక్ట్రానిక్ కంపెనీ, ఒక బట్టలు తయారు చేసే కంపెనీ.. ఒక అగ్గిపెట్టెలు తయారు చేసే కంపెనీ ఒక బేకరీ వెలిసాయి.పెద్ద పెద్ద దుకాణాలు, కంపెనీలు సహితం వారి చిరునామాలో కట్టెల మండీ పక్క అనో, వెనక అనో, ఎదురు అనో వ్రాస్తేనే ఎవరికైనా అర్థమయ్యేంత పెద్ద పేరు మాది.

ఏదో చదువుకోవాలని నాయన వత్తిడి తెచ్చాడు గనక 10 పాస్ అయినా నాకు పెద్దగా చదువు మీద శ్రద్ద లేదు. ఇంత బంగారం లాంటి వ్యాపారాన్ని వదులుకుని చదువుకోవడం అవసరమా అని అందరూ అనడమే కాకుండా నాకూ అనిపించేది. అటు తిరగేసి, ఇటు తిరగేసినా ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఒక్కడినే మగ పిల్లవాడిని
బిడ్డా ఏదన్నా ఉద్యోగం చూసుకొమ్మని నాయన, చిన్నాయనలు చెప్పినా నేను పెద్దగా వినుకోలే. ఇల్లంతా ఆడపిల్లలు, అందరం అడితీలో కూచుంటే ఏమొస్తదయ్యా అని అంటూ ఉండేవారు కానీ బలవంతం చెయ్యలేదు..నేనంటె అందరికీ ముద్దు మరి!

అక్క చెల్లెళ్ళ ప్రేమానురాగాల మధ్య ముగ్గురమ్మల మధ్య అపురూపం గా పెరిగాను.
  
అప్పుడప్పుడే కొద్ది మంది మిలిటరీ లో రిటైర్ అయిన వారు కంపెనీ ఉద్యోగాలకని మా ఊరొచ్చి కిరసనాయి స్టవ్వులు తెచ్చుకున్నా, నీళ్ళు కాచడానికి మాత్రం కట్టెలు కొనుక్కెళ్ళే వారు

నేను 10 పాస్ అయిన కొద్ది రోజులకి ఏదో కొత్తరకం స్టవ్వొచ్చింది. గ్యాస్ స్టవ్వంట. మా వాళ్ళందరూ కొంచెం విడ్డూరం గా చూసారు. ఒకానొకమ్మ కొననే కొంది గానీ ఆమె స్టవ్వు ఎందుకో పేలి మంటల్లో ఆమే కాలి చనిపోయాక మళ్ళీ స్టవ్వు పేరెత్తితే ఒట్టు. 4 , 5 ఏళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు కానీ గ్యాసు కంపెనీ ఒకటి మా మెయిను రోడ్డు మీద వెలిసింది. కంపెనీ ఉద్యోగులు వాళ్ళ ఊళ్ళల్లో చూసారేమో బాగానే కొని, ఇటువైపు రావడం మానేసారు. అలా అలా అమ్మ కూడా గ్యాస్ స్టవ్వు కొనుక్కుందాం ఊదీ ఊదీ నా పేగులెండిపోతున్నాయ్ అనే వరకూ వచ్చింది. ఇంక మన ఇంట్లోనే వచ్చినప్పుడు ఊరంతటా రానే వస్తుందిగా.. 


ఇకపోతే మిగిలింది కలప. కలప మీద ఎక్కువ దృష్టి పెట్టాడు నాయన. అది కొద్ది రోజులు బాగానే నడిచింది కానీ మెషీన్ చేత ఎక్కువ ఇష్ట పడుతున్నారంటూ వడ్లోల్లు పని మానేసి ఫ్యాక్టరీల దారి పట్టారు. ఎటు చూసినా ఫర్నిచరు దుకాణాలు వెలిసాయి. పీటలు, బల్లలు చేయించుకోవాడానికెవరికీ ఇష్టం కానీ తీరిక కానీ లేవు. అన్నన్ని రోజులాగడానికెవరికి ఓపిక..ఇలా వెళ్ళి అలా కొనుకొచ్చుకుంటున్నారు. దర్వాజాలు, ద్వారభంధాలు కూడా అంగడిలో అన్ని డిజయిన్లల్లో దొరుకుతున్నాయి. పెద్దక్క పెళ్ళి కుదిరింది. బావకి ఎవరూ లేరంట మా ఇంటి దగ్గరే కంపెనీ కొలువు. వాళ్ళు బయట ఉండడమెందుకని వెనక షెడ్డు కొంచెం తగ్గించి ఇంకో గది వేసేటప్పుడు పెళ్ళికి ఎక్కువ రోజులు లేవని మేము గదికి కావలసిన కిటికీలు, గుమ్మాలు అంగడిలోనే కొనాల్సి వచ్చింది. నెమ్మదిగా మా అమ్మకాలు తగ్గిపోయాయి. తెచ్చిన కట్టెలు, కలప అలాగే పడి ఉంది.

మరు ఏడు మా చిన్నక్క అంటే నడిపి చిన్నాయన కూతురికి సంబంధం వచ్చింది. నాయన చీటీలు పాడి, కొంత అప్పు తెచ్చి చిన్నాయన కూతురికి పెళ్ళి చేసాడు. అది పూర్తిగా అయ్యిందో లేదు నాయనకి పక్షవాతం వచ్చింది. మా నడిపి చిన్నమ్మకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరుమామ గారు చనిపోయారని మా చిన్నాయనకి కబురొచ్చిందిఅక్కడ కొద్దిగా ఉన్న  పొలాలు చూసుకోడానికి ఎవ్వరూ లేరని అక్కడే ఉండిపొమ్మని అడిగారు ఆయనని. ఇక్కడ ఎలాగూ వ్యాపారం నడవట్లేదు వెళ్ళు అన్నాడు మా నాయన. పోవుడు పోవుడు మళ్ళీ కనబడలేదు మా చిన్నాయన. కట్టెల దగ్గర పనిచేసే పిల్లల అవసరం తీరిపోయింది. నేను కూచుంటున్నా. అప్పుడప్పుడు జరిగే అమ్మకాలతో రోజులు కష్టంగానే దొర్లుతున్నాయి. కుటుంబాన్ని చూసి నాయనకి దిగులుగా ఉందేమో ఇంక నేనెన్ని రోజులో కుటుంబమెట్ల  బిడ్డా అన్నాడు. లేదు నాయనా మన వ్యాపారం మంచిగవుతుంది. నువ్వేమీ బాధ పడకు అన్నాను. నిరాశగా చూసాడు. ముని రాముణ్ణి పంపి దగ్గరలో ఉన్న ఫర్నిచర్ షాప్ కి ఏదో ఒక ధరకి ఉన్న కలపంతా అమ్మేసాడు నాయన. దాంతో మా రెండొ అక్క పెళ్ళి ఎలాగోలా అయిందనిపించారు

రెండేళ్ళ తర్వాత జరిగిన పెళ్ళి కి మా నడిపి చిన్నాయన, చిన్నమ్మ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు పనులున్నాయంటూ. పిల్ల పెళ్ళికి ఏమైనా సర్దాడా అని అందరూ అడుగుతుండే వారు. ఏమీ లేదని చెప్పడం నాయనకి తెగ ఇబ్బందిగా ఉండేది. ఆయన బిడ్డ పెండ్లి ఉమ్మడిలో ఉండంగ అయిపోయింది ఆయనకేమి పట్టింది ఇప్పుడొచ్చి ఇయ్యనీకి అంటాడు మా ముని రాముడు మామ. పోనీలేరా వాడు చల్లగా ఉంటే చాలు అంటాడు మా నాయన. మా అక్క పెళ్ళిలోనే నాకూ పిల్లని చూసారు. ఉన్న ఒక్కడి పెళ్ళి చూడకుండా పోతానేమో అని నాయన హడావిడిగా నా పెళ్ళి కూడా కానిచ్చేసాడు. నా పెళ్ళయిన కొద్ది నెలలకే నాయన కాలం చేసాడు. మిగిలింది నేను ఆఖరు చిన్నాయన. ఇద్దరాడ పిల్లలాయనకి. ఇంత మంది భాధ్యత ఉన్నా పెద్దగా వ్యాపార విషయాలు కానీ సంపాదించే తెలివి తేటలు కానీ లేవాయనకి. ఏందిరా ఇప్పుడేం చేద్దాం అంటాడు. నువ్వేం చెప్తే అదే, పెద్దన్న కొడుకు పెద్దన్నతో సమానమంటాడు.

వ్యాపారం ఇంక జరగదని తెలుసు. దగ్గరలో ఉన్న ఒక కంపెనీలో మాట్లాడి వచ్చా. ఎగా దిగా చూసి నాకూ మా చిన్నాయనకీ బరువులు మోసే పనులు ఇచ్చారు. చిన్న జీతాలు, బరువు పనులు. ఇంత బతుకూ బతికి ఇంటి వెనక చచ్చినట్టుంది మా ఇద్దరికీ. అందరూ మమ్మల్నే చూస్తున్నట్టుంటుంది. అయ్యో అన్నట్టు చూస్తున్న చూపులకి అవమానం తట్టుకోడం కష్టమే. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఓదార్చుకుంటున్నట్టున్నాము. 2 రోజుల్లోనే చిన్నాయన నడుము నెప్పికి తట్టుకోలేక పోయాడు. తనేమీ చేయలేడు పాపం చిన్నప్పటి నించీ చూస్తున్నాగా. ఇంక చాలులే కట్టెల దగ్గర కూచో అక్కడెవరన్నా కొనడానికొస్తే వస్తే ఎవరు చూస్తారని సద్ది చెప్పా.

అనుకోకుండా ఒక కబురొచ్చింది. స్మశానానికి అటు వైపు ఉన్న కట్టెలడితీ వాళ్ళకేమయ్యిందో కుటుంబమంతా రాత్రికి రాత్రి ఊరొదిలి వెళ్ళిపోయారు. దాంతో శివులోరి ఇంటి గిరాకీ అంతా మా దగ్గరకొచ్చింది. మా వైపు 6,7 ఊళ్ళకి ఒక్కడే హరిస్చంద్రుడు. ఒక్కటే శివ పురి. దాంతో మళ్ళీ కట్టెల వ్యాపారం ఊపందుకుంది. ఇద్దరం పని మానేసి వ్యాపారం లో పడ్డాము.  ప్రతి రోజూ కుటుంబం తిండికి సరిపడా అమ్మకాలు ఉండేవి.. ఎప్పుడైనా అమ్మకాలు లేకపోతే ముని రాముడు మామ స్మశానం దాక వెళ్ళి చూసొచ్చేవాడు. ఆయన చిన్నప్పటి నించీ మా ఇంట్లో కట్టెల షెడ్డు పక్కన కలపతో చేసిన చిన్న గుడిసె లాంటి దాంట్లో ఉండేవాడు. పనులేమీ చెయ్యడు. పద్యాలు తత్వాలూ పాడుకుంటుంటే ఊళ్ళొ వాళ్ళు వాళ్ళకి తోచింది ఇచ్చిపోతుంటారు. నాయన ఎప్పుడూ అద్దె అడగటం కానీ విసుక్కోవడం గానీ నేను చూసి ఎరుగను. కట్టెల లోడ్ వచ్చినప్పుడూ, కట్టెలు కొనడానికి ఆడవాళ్ళో, పిల్లలో వచ్చినప్పుడూ ముని రాముడు బాగా సహాయ పడేవాడు. షెడ్డులోంచి బయటికీ, బయటనించి షెడ్డులోకీ మార్చాల్సి వచ్చినప్పుడు కూడా ముని రాముడు లేకుండా జరగదు. అతను మాకొక శ్రేయొభిలాషి. బిడ్డా పుట్టినోడు గిట్టక మానడు గదా.. గిట్టేటోడు రోజుకొకడు గిడితే మనకి బువ్వెల్లిపోద్ది కదా...ఏందో ఈనాడెవడూ గిట్టలే అంటాడు. పోనితియ్ మామా మన కోసం ఎవళ్ళని గిట్టమంటావూ అని పెద్దక్క విసుక్కునేదికట్టెని కొట్టా పొయ్యిలో పెట్టా అన్నట్టు తిండెళితే చాలు అన్నట్టు జరిగుతోంది వ్యాపారం. ఒక సంవత్సరం శివులోరి దయ వల్ల ఊర్లో ఏదో వ్యధి వచ్చి చాలా మంది మరణించారు. జనాలు మరణించడమనేది మాకు చాలా మామూలు విషయమై పోయింది. ఎవరైనా మరణించకపోతేనే మాకు పెద్ద విషయం. ఎలా అయితేనేం వ్యాధి పుణ్యమాని ఇల్లు గడుపుతూ ఇంకో చెల్లి పెళ్ళి చేసాము నేను చిన్నాయనా కలిసి.

ఇంకొక్క ఇద్దరివి చేసేస్తే నాయన భాద్యత తీర్చినోణ్ణవుతావని చుట్టాలందరూ అంటారు. చూద్దాం. లెక్కన దేవుడు చల్లగా చూస్తే, ఇంకో రెండేళ్ళలో ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళీ ఒకే సారి చేసేద్దామని అన్నా చిన్నాయన తో. కళ్ళు తుడుచుకుంటాడు తప్ప మాటా అనడు..ముని రాముడు మామ మాత్రం దేవుడు నిన్ను చల్లగా చూడాలె బిడ్డా అంటాడు.

సినెమా థియేటరు ఎందుకో కూలగొడుతున్నారని తెలిసి అటు వెళ్ళా. ఇక్కడెందుకో సినెమాలు ఆడుతల్లేవురా..లాస్ వస్తాంది. అమ్మేసి అపార్టుమెంటోల్లకిచ్చేస్తన్నా.. ఒక పోర్షనిచ్చి 2 లచ్చలిస్తరంట అన్నాడు. ఒక యాడాదిలో అపార్టుమెంటు పూర్తయ్యింది. దాని ఎదురుగా ఉన్న రెండు పెద్ద ఇళ్ళవాళ్ళు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. అలా అలా శ్మశాన వాటిక కొద్ది కొద్దిగా అటు జరిగింది. లోపు బైబిల్ హవుసు దగ్గర ఎలెక్ట్రిక్ శ్మశాన వాటిక వచ్చి పడింది. ఇబ్బందీ లేకుండా నిమిషంలో బూడిద చేస్తుందట మిషను. ఇంక కట్టెలూ కాల్పులూ ఎవ్వరూ పెట్టుకోవట్లేదు. అందరూ అక్కడికే పోతున్నారు. ఇంకా ఒకటీ అరా చాదస్తులు ఉన్నా , మల్కాజిగిరికో, భోలక్ పుర్ కో పోతున్నారు. శివపురి ఒక పక్క నించి  ప్లాట్లు వెయ్యడం మొదలెట్టారు. నెమ్మదిగా ఒక వైపు ఇళ్ళు కట్టడం ప్రారంభించగానే, ఇంకో పక్క ప్లాట్లు వేస్తున్నారు.   మాకు గిరాకీ తగ్గి, రాను రాను పూర్తిగా పోయింది. మనం కూడా అపార్టుమెంటుకిచ్చేద్దాం చిన్నాయనా అన్నా. నీ ఇష్టం బిడ్డా అన్నాడు. ఒక వాటా, రెండు లక్షలు వచ్చాయి. నడిపి చిన్నాయనొచ్చి పోర్షను 4 లక్షలు చేస్తుంది. అందులో నేను వాటాకొస్తే మీరందరూ ఎక్కడుంటారు పాపం అని జాలి పడుతూ తన వాటాగా రెండు లక్షలు తీసుకెళ్ళాడు. కొద్ది రోజులవ్వగానే మా ఇల్లు కుదువకు పెట్టి పెండ్లిళ్ళు  చేసాం. పెద్దక్కా వాళ్ళు విడిగా వెళ్ళిపోయారు. దగ్గరలోనే చిన్న రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకుని చిన్నాయన కుటుంబం, నా కుటుంబం సర్దుకుంటున్నాము. మొత్తం మీద మా కట్టెల మండి కూలిస్తే 14 వాటాల పెద్ద ఇల్లయ్యింది గానీ మా ఇల్లు మాత్రం ఇరుకయ్యింది. ముని రాముడు ఇప్పుడు మా అపార్టుమెంట్ వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసి పెడుతూ పార్కింగ్ స్థలం లో పడుకుంటాడు. కాపలా ఉంటాడనేమో ఎవ్వరూ ఏమనరు

కంపెనీ ఉద్యోగానికెళుతున్నా గానీ అవి తిండికి కూడా చాలట్లే. ఇంటి కుదువ మీద వడ్డీ,అద్దె ఎక్కడినించి తేవాలో ఎంత ఆలోచించినా అర్థం కావట్లే. అటు తండ్రి లాంటి అమాయకపు చిన్నాన్న ఇటు ఆయనకి తగ్గ చిన్నమ్మ, అటు వయసు మీద పడ్డ నా తల్లి ,ఇటు చంటిపిల్ల తల్లి నా భార్య. ఎవరినేమనను. కంటికి నిద్ర లేకుండానే తెల్లవారుతున్నాయి చాలా రాత్రిళ్ళు. నాయన చెప్పినట్టు చదవకనైన పోతినని ఇప్పుడనిపించినా ఏం లాభం!. జీవితమెటుపోతుందో తెలవట్లేదుచిన్న దానికి  మూసిన కన్ను తెరవకుండా ఒకటే జ్వరం. ఆస్పత్రికి తీసుకెళ్ళాం. చిన్న దానికి గుండెలో చిల్లుందిట. నా గుండెకి అంతకన్నా పెద్ద చిల్లు పడింది. ఊళ్ళో వాళ్ళ దుఖమంతా మా ఇంటికొచ్చినట్టనిపించింది. ఎవరో ఒకరు చనిపోవాలని కోరుకున్నాం ఇన్నాళ్ళు, చీ పాడు బతుకు.. శాపమే తగిలుంటుందని పదే పదే అనిపిస్తోంది. ఒకందుకు నయమే. మధ్య జనాలు చనిపోవాలని ఇంట్లో ఎవ్వరూ కోరుకోవట్లేదుకానీ మా ఇంట్లో ఎవ్వరిని కదిలించినా ..చీ పాడు బతుకు చచ్చిపోవాలని ఉంది అంటున్నారు.

మాటా మాటా ద్వారా అనంత పురం లో సత్య సాయి సన్నిధిలో గుండె ఆపరేషన్లు ఉచితంగా చేస్తారని విని నా భార్య మంగళ సూత్రాలు, మా అమ్మ వెండి గాజు అమ్మిన డబ్బులు తీసుకుని అక్కడికెళ్ళాము. దేవుడి దయ వలన ఆపరేషను జరిగిందిఅదృష్టం కొద్దీ పాపకి సంబందించి ఒక్క ఖర్చు కూడా కాలేదు. అంతా ఉచితమే. ఇంటికి తీసుకెళ్ళి 10 రోజుల తర్వాత తీసుకొచ్చి డాక్టరుకి చూపించమన్నారు. ఇంటికి బయల్దేరాము. సరిగ్గా టికెట్లకి ఉన్నాయి. కడుపు ఆకలితో నక నక లాడుతోందికాసిని మంచి నీళ్ళు తాగి సాయంత్రం బండెక్కుదామనుకునేలోపు మా పక్కింటోళ్ళకి చుట్టాలంట వాళ్ళు ఫోన్ చేసారని వచ్చారుఇంటికి రండి భోజనం చేసి వెళుదురుగాని అన్నారు. మేము బాగా మొహమాట పడ్డాము. రండి ఫర్వాలేదు అని బలవంత పెట్టారు వాళ్ళు. చాలా మొహమాటం గా వెళ్ళాము.
భోజనాలయ్యాక ఇంక వెళతామండీ..లేవబోయాను. ఎక్కడికి అన్నాడాయన. 10 అయింది కదండీ 11 గంటల బండికి వెళతాం అన్నా .అప్పుడే ఎలా వెళతావ్? డాక్టరు గారికి ఇక్కడైతే దగ్గర, 10 రోజులాగి వెళుదువులే తొందరేమీ లేదు అన్నాడాయన. ఆయన చెప్పారంటే విని తీరాల్సిందే ఇంకో మాట లేదు అన్నది అతని భార్య చనువుగా. చేతులు జోడించా కన్నీళ్ళతో. . చాలా రోజులకి కడుపు నిండా తిండి పడగానే  కళ్ళ మీదకి నిద్ర ముంచుకొచ్చింది.

మర్నాడు ఉదయం నిద్ర లేచాక...ఏమయ్యా నీకు ఇన్షురెన్స్ ఉందా అని అడిగాడాయన. లేదే అదేంటీ అని అడిగా బలహీన స్వరంతో. నీకేమన్న అయితే నీ కుటుంబానికి సాయం అందాలి కదా ఏర్పాట్లు ఏమీ చెయ్యలేదా అన్నాడు. లేదండీ పూటకి గడవడమే కష్టం గా ఉంది..అవన్నీ ఎక్కడా అన్నా. మా విషయాలు అడిగి తెలుసుకున్నాడు. ఏమనుకుంటాడో అని భయపడుతూనే ఎవరో ఒకరు వినడానికి దొరికారన్నట్టు అన్నీ చెప్పేసి, చివరగా పిల్ల ఆరోగ్యం గురించి చెప్పి వెక్కి వెక్కి ఏడ్చా. నేను ఇంటికి పెద్దలా వ్యవహరిస్తున్నందుకేమో ఎప్పుడూ ఏడ్చే అవకాశం రాలేదు. ఆయన నన్ను ఓదార్చకుండా చాలా ప్రశాంతంగా నా ముఖం లోకి చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు బరువు దిగినట్టు ,పెద్ద వాన పడి వెలిసాక భూమి నిర్మలంగా శుభ్రంగా ఉన్నట్టు అదో లాంటి ప్రశాంతత వచ్చింది. ఆయన నన్ను కాసేపు అలా ఉండనిచ్చి నువ్వేం చదివావ్ అని అడిగాడు. 10 అన్నా మొహమాట పడుతూ. హమ్మయ్యా అది చాలు బతకడానికి అన్నాడాయన భరోసాగా. నేను ఇంకా ఆశ్చర్యం నించి తేరుకోక మునుపే చెప్పాడు... నువ్వు ఇన్షూరెన్స్ ఏజెంట్ గా  గా చేరుతున్నావు నా దగ్గరే. నీ లాంటి వాళ్ళందరికీ ఇన్షురెన్స్ చేయించాలి. చాలా చిన్న మొత్తం కడితే చాలు జీవితమంతా చీకు చింతా లేకుండా ఉండచ్చు తెలిసిందా అన్నాడు. తల ఊపా ఏదో అర్థం అయినట్టు .
కాస్త అలవాటయ్యేదాకా కష్టంగానే ఉండింది. నెమ్మదిగా నాలాగే అభివృద్ధి వల్ల వృత్తి పోగొట్టుకున్న చాకలి రవి గాడికీ, శాలోళ్ళ శ్రీరాములు కీ, వడ్లోళ్ళ నరహరికీ చెప్పా. రవి గాడు డ్రై క్లీనింగ్ దుకాణం పెట్టుకుంటాడుట. దాని కోసం ట్రెయినింగ్ అవుతున్నాడు. వాషింగు మిషనులొచ్చాయనో , బయట నీళ్ళల్లో ఉతికితే మంచిది కాదనో ఎవరు బట్టలు ఉతకడానికెయ్యక వాళ్ళ బతుకు వీధిన పడింది. గుడ్డిలో మెల్ల వాళ్ళ నాన్న అపార్టుమెంటు పక్కన ఇస్తిరీ చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడు. శ్రీరాములు, నరహరి నాతో ప్రయాణానికి ఒప్పుకున్నారు. అందరం కలిసి ఉద్యోగాల్లో చేరాము. జీవితం ఒక్క సారి మారిందని కానీ ,ఆకలి చల్లారిందని చెప్పలేను కానీ రోజూ కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు జీవితం కొంచెం కొత్తగా ఉంది. ప్రతి వారం సెమినార్లకి పంపుతున్నారు. అక్కడ మాట్లాడే వారి గురించి తెలుసుకున్నప్పుడు జీవితం మీద ఆశ కలుగుతోంది. ఇలాంటి వాళ్ళ పరిచయాల వల్ల నా బిడ్డని బాగా చదివిస్తానని నమ్మకం వచ్చింది. నా లాగా ఎవరైనా కనబడితే చాలు మా ఆఫీసరు దగ్గరికి పట్టుకుపోతున్నా. నాకు బాగా నచ్చిన విషయమేంటంటే మాతో ఇన్షురెన్స్ చేయించుకున్న వాళ్ళందరూ బాగుంటేనే మా వ్యాపారం బాగుండేది. వంకన  ఉద్యోగం లో చేరాక నిద్ర లేవగానే అందరూ బాగుండాలని  మొక్కుతున్నా. ఇలా అందరూ బాగుండాలనుకునే ఉద్యోగాలు కూడా ఉంటాయని నాకు ఇప్పటి వరకూ తెలియదుఇన్షురెన్స్ పాలసీలు అమ్ముతున్నప్పుడు నాకైతే కట్టెలమ్మిన చోట పువ్వులమ్మినట్టుంది మరి!
అన్నట్టు మీకూ ఇన్షురెన్స్ కావాలండోయ్! కలుద్దాం మరి ,ఎప్పుడు రమ్మంటారు?


ఇంటెల్ " లేడీ "

Wednesday, September 28, 2016

అది 2011. ఫోన్ కార్డులు కొనుక్కుని గంటలు గంటలు మాట్లాడ్డం అలవాటయ్యింది నాకు , మా అత్తగారికీ. ఈ మధ్యన ఎందుకో ఫోన్ మాటిమాటికీ కట్ అవుతోంది. వర్షాల వల్లనో లేక ఎక్కువమంది మాట్లాడే టయిములో మాట్లాడడం వల్లనో అని అనుకున్నాం గానీ అలా ఎందుకు కట్ అవుతోందో కారణం తెలియదు. అడగ్గా అడగ్గా ఫోన్ కింద పడిందని నెమ్మదిగా చెప్పారు ఒక రోజు. ఒక స్నేహితురాలు ఇండియా వెళుతున్నానని చెప్పగానే, ఒక ఫోను కొని పంపించాము. అది తను తీసుకెళ్ళి ఇవ్వగానే మళ్ళీ మామూలుగా మాట్లాడేసుకోవచ్చని వెయిటింగు . మాటలంటే గంటలు గంటలు మాట్లాడేస్తా కానండీ, నేను టెక్నాలజీలో పరమ పూరు. కొత్తగా వస్తున్న ఫోన్ ల గురించి కానీ, వాటి లాక్ అన్లాక్ విషయాలు కానీ నాకు బొత్తిగా తెలియదు. నా అంత నాకు ఓల్డు ఈస్ గోల్డు. ఎన్నేళ్ళయినా బీసీ నాటి నా చిట్టి ఫోన్ ని వాడేస్తానే తప్ప కొత్తవి కొనుక్కోమని ఎవరైనా చెప్తే "పాతది బానే పనిచేస్తున్నప్పుడు కొత్తది మార్కెట్లోకి వచ్చిందని కొనెయ్యడమేనా" అని చిరాకు పడిపోతాను కూడా. మొన్ననే కొత్తగా కెమేరా ఉన్న ఫోన్ లు వచ్చాయని అంటగట్టాడు రోజర్స్ వాడు. ఆ ఫోన్ కూడా ఇంకో స్నేహితురాలు ఇండియా వెళుతుంటే మా చెల్లికి పంపేసా. అప్పుడెప్పుడో మాటల్లో కెమేరా ఫోన్ భలే ఉంటుందక్కా అంది, అలా సరదా పడేవాళ్ళకి ఇస్తే సంతోషం కదా మరి. *** వారం అయ్యాక ఫోన్ చేసినప్పుడు మేము పంపిన ఫోన్ అందింది కానీ అన్ లాక్ అవలేదని చెప్పారు అత్తగారు. సరే, ఇంకెవరైనా వెళుతుంటే ఇంకొకటి పంపాలని అనుకున్నాము. ఆ తరువాత ఏదో కారణాల వల్ల మరో వారం లో నేను బయల్దేరి వెళ్ళిన నా భారత దేశ యాత్ర మీకు తెలుసు కదా ! అలా వెళుతూ వెళుతూ మా సీతయ్య ఇక్కడ కెనడాలో అన్లాక్ చేయించి ఇచ్చిన ఫోన్ ఒకటి పట్టుకెళ్ళా..బట్ ఎందుకో అది కూడా అక్కడ పని చేయ్యలేదు. బజార్లో నాలుగైదు చోట్ల తిప్పినా అది మొండికేసింది. సీతయ్యతో ఆ విషయం చెప్పగానే, " ఇంక ఇక్కడి నించి పంపడం వేస్ట్ కానీ, అక్కడే ఒక ఫోన్ కొనియ్యి" అన్నారు. సరే అలా సర్ప్రయిజ్ చేద్దాంలే అనుకున్నా. ఎప్పుడొచ్చినా, పది రోజుల కోసం రావడమే. పది రోజులూ పది నిమిషాల్లా అయిపోతాయి. ప్రయాణం దగ్గర పడడంతో ఆ సాయంత్రం అతి ముఖ్యులైన చుట్టాలని కలవడానికి వెళ్ళి, తిరిగి వస్తున్నాం. స్కూళ్ళు వదిలే సమయం కావడం తో ఆటోలు దొరకడం కష్టమయింది. కొంత దూరం నడిచి, వెతగ్గా వెతగ్గా ఒక ఆటో దొరికింది. మాటల్లో ఆ అబ్బాయి మా ఇంటి దగ్గరే ఉంటానని చెప్పాడు అంటే, ఆదరాబాదరా మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలని సతాయించడు అన్నమాట. "మధ్యలో కొంచెం ఆగాలి బాబూ" అన్నాను. "ఫర్వాలేదు అక్కా, ఎక్కడ ఆపాలో చెప్పండి" అన్నాడు. దారిలో ఏవైనా ఫోన్ అమ్మే దుకాణాలు కనబడతాయా అని చూస్తున్నా. స్కూల్స్ పిల్లలతో దారంతా బాగా రష్ గా ఉంది. మధ్యలో ఎక్కడా ఆటో ఆపడానికి వీలు అవలేదు. అటూ ఇటూ చేసి గోల్నాకా వచ్చేసింది. ఇంకో స్టాప్ దాటితే మా ఇల్లు వచ్చేస్తుంది.. రేపు నా ప్రయాణం..ఇప్పుడు తప్పితే ఫోన్ కొనడానికి కుదరదు. అదృష్టం కొద్దీ, గోల్నాక చౌరాస్తా మలుపులో ఒక దుకాణం కనబడింది. అన్ని రకములైన ఫోన్ లు అమ్మబడును, రిపెయిర్లు కూడా చెయ్యబడును అని కనబడేసరికి ప్రాణం లేచి వచ్చింది. ఆటో ఆపమని "అత్తయ్యా మీరు, వల్లి ఆటోలో కూర్చోండి..ఇక్కడ ఫోన్ అన్ లాక్ చేస్తాడేమో అడిగి వస్తా" అన్నాను. సరే అన్నారు. నేను లోపలికెళ్ళి ఫోన్ చూపించా. ముందు ఊహించినట్టే, అన్ లాక్ అవలేదు. సరే, కొత్త ఫోన్ చూపించమన్నా. "ఎవరికండీ? ఏ రేంజ్ లో" అని అడిగాడు షాప్ అతను. "అదిగో, ఆటోలో కూచున్నారే! ఆవిడకి" అని చేతితో ఆటో వైపు చూపించా. తొంగి చూసి, "పెద్దావిడకా" అంటూ..పెద్ద పెద్ద అక్షరాలున్న ఫోన్ చూపించారు. "కాదమ్మా మామూలువి చూపించండి, ఆవిడ కళ్ళు చక్కగా పని చేస్తాయి" అన్నాను. వాళ్ళు చూపించిన వాటిలో నాకున్న పరిజ్ఞానంతో కాకుండా వాళ్ళనే అడిగి, మంచిది అని అనిపించినవి మూడు పక్కన పెట్టి, చెల్లిని అత్తయ్యనీ లోపలికి పిలిచా... "వీటిలో మీకు నచ్చింది తీసుకోండి అత్తయ్యా" అన్నాను సర్ప్రైస్ చేద్దామని. "ఇవే ఉన్నాయా" అన్నారు అత్తయ్య. "ఇంకా చాలా ఉన్నాయండీ" అని ఇంకా చాలా చూపించారు షాప్ వాళ్ళు . "టచ్ స్క్రీన్ లేవా" అని అడిగారు అత్తయ్య. ఆ పిల్లాడు అమాంతం నోరు తెరిచాడు. ఆవిడ ఆ మాట పలికే తీరుకి తెగ మురిసిపోయి "ఉన్నాయి ఆంటీ" అని వాటిని తెచ్చి చూపించాడు.. నాకు వాటి గురించి పెద్దగా తెలియదు కాబట్టి, నేను పక్కన నించుని చూస్తున్నా. అత్తయ్య వాటిని పరీక్షగా చూసి, ఒకటి సెలక్ట్ చేసారు. "ఇది బాగుంది కదూ" అని నన్నూ, వల్లినీ అడిగారు. మేమిద్దరం తెల్లమొహాలేసి, "దాంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయో లేదో చూడడం మాకు తెలీదత్తయ్యా, బుజ్జాయిని రమ్మని ఫోన్ చేద్దామా" అన్నాము. అత్తయ్య పట్టించుకోకుండా ఫోన్ ని అటూ ఇటూ తిప్పి చూస్తున్నారు. ఈ లోపు ఆ షాప్ కుర్రాడు "ఆంటీ ఆగండి, మీకు దీన్ని ఎలా వాడాలో చూపిస్తా" అని తాపత్రయ పడ్డాడు. "దాంట్లో చూపించడానికేముంది నాయనా..ఇక్కడ నొక్కితే ఓపెన్ అవుతుందీ..ఇలా స్క్రోల్ చేస్తే కాంట్టాక్ట్స్ వస్తాయి, ఇది నొక్కితే పాటలొస్తాయి" అని టపా టపా అన్నీ ఆ అబ్బాయికి చూపించేసారు. ఆ అబ్బాయి చూపిచ్చిన ఎక్స్ప్రెషను చూసో, ఆవిడ మాటలు విని సరదా వేసో కానీ, అక్కడున్న 4గురు సేల్స్ పిల్లలూ, షాప్ ఓనరానీ కూడా మా దగ్గరికి వచ్చేసారు. వాళ్ళూ అడుగుతున్న ప్రశ్నలకి మా అత్తయ్య అష్టావధానిలాగా జవాబులు చెప్తున్నారు. ఈ హంగామా విని లోపల రిపెయిర్ పని చేసుకుంటున్న ఇద్దరబ్బాయిలు, ఆటో అబ్బాయి కూడా కుతూహలంగా వచ్చి నించుని చూస్తున్నారు. ఇంతలో మా అత్తయ్య "ఇది ఎన్ని జీబీ" అని అడిగారు. డేటా కార్దు అవీ ఇవీ అన్నీ అడుగుతున్నారు. పిల్లలెవరినీ సహాయానికి పిలవక్కరలేదని మా ఇద్దరికీ అప్పటికే అర్థమయిపోయి చూస్తూ ఉన్నామంతే. బేరసారాలు అన్నీ అయిపోయాయి. ఓనరు గారు ఫోన్ ప్యాక్ చేసేస్తూ, "ఆంటీ, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది... మీకు 2 జీబీ ఎక్స్ట్రా ఇస్తా..రేపు పొద్దున్న ఎవరినైనా పంపండి. మీకు కావలసిన పాటలన్నీ పెట్టిస్తా, ఏం పెట్టమంటారో ఇప్పుడే చెప్పెయ్యంది.. సుప్రభాతం, విష్ణుసహస్రనామం పెట్టనా" అన్నాడు. "అవి నా దగ్గర ఉన్నాయమ్మా. వీలైతే మంచి పాటలు పెట్టు" అన్నారు అత్తయ్య. "సరే లెండి ఘంటసాల భక్తి గీతాలు పెడతా" అన్నాడా అబ్బాయి. "అబ్బే ఆ కలెక్షనంతా ఉందమ్మా..కావాలంటే మంచి కొత్తపాటలు పెట్టు" అంటూ నాకు తెలియని కొత్త సింగర్ల పేర్లేవో చెప్పారు అత్తయ్య. సారీ అండీ నాకు కొత్త ఆ సింగర్ల పేర్లు తెలియక పోవడం వల్ల మీకు చెప్పలేకపోతున్నాను. నా అజ్ఞానానికి అప్పటికే నేను బోల్డు చింతిస్తున్నా.ఇంక మీరు మరీ జెనరల్ నాలెడ్జీ కొచ్చన్లు అడక్కండి నేను హర్ట్ అవుతా...! ఇంక ఫోన్ తీసుకుని వస్తుండగా షాప్ పిల్లాడొకడు.." ఆంటీ, మీరు మాకంటే ఫాస్ట్ ఉన్నారు! మీకు ఇవన్నీ ఎలా తెలుసూ? చూడబోతే, మీ కోడళ్ళకి కూడా తెలిసినట్టు లేదు " అన్నాడు. "అదేముంది నాయనా, నా కోడళ్ళకంటే ఇవన్నీ తెలుసుకునే తీరిక ఉండదు. ఇంటి పనులు, పిల్లలు, చదువులూ ఉంటాయి. నాకు అలా కాదుగా.. నా మనవలందరూ పెద్ద పెద్ద చదువులు చదువుతారు. వాళ్ళకి తగ్గట్లు నేను ఉండాలా వద్దా? అందుకే నేర్చుకున్నా..అయినా ఇదేమన్నా బ్రహ్మ విద్యా..?" అని అంటూ చిరునవ్వుతో అందరికీ బై చెప్పి, ఆటోలో కూర్చోవడంతోనే ఫోన్ సెట్ చేసుకుని, అందరికీ కొత్త నంబరు ఇచ్చే ప్రయత్నంలో పడ్డారు అత్తయ్య. ఈ సంఘటన్ని మా ఆఫీస్ లో అందరూ మరీ మరీ గుర్తు చేసుకుంటుంటారు. మొన్ననే మా బాస్ అడిగింది "మీ అత్తయ్యకి ఇంకా ఐపాడ్ కొనలేదా" అని..."కొంటానండీ, ఇండియా వెళ్ళే స్నేహితులు ఎవరూ దొరకట్లేదు..వెళితే తప్పకుండా పంపిస్తా" అన్నా. "మీ అత్తగారికి అయి పాడా? మరి ఆవిడకి వాడడం వస్తుందంటావా" అని అంది కొత్తగా వచ్చిన కొలీగ్. కథలు చక్కగా చెప్పే మా బాసిణి, నేను గతం లో చెప్పిన పైనున్న ఫోన్ కథ మొత్తం పూస గుచ్చినట్టు చెప్పారు ఆ కొత్త కొలీగ్ కి. "మై గుడ్నెస్! వెంటనే ఈ కథ మా అమ్మకి చెప్పాలి. తను ఎప్పుడూ తోచదంటుంది..ఏదైనా కొనిస్తే వద్దంటుంది.. మీ అత్తయ్య దగ్గరికి పంపనా కొన్ని రోజుల కోసం, త్రైనింగ్ ఇమ్మందాం" అంది తను సరదాగా. "పంపండి కానీ జమైకా నించి ఇండియా కి టికెట్ మాత్రం మీదే సుమా" అని నవ్వాన్నేను. ( 2012 లో కథ వ్రాసి పెట్టి ఏ కారణం వల్లో మరి పోస్ట్ చెయ్యడం మరచిపోయాననుకుంటా. విమల గారి కామెంటు పుణ్యమాని నా బ్లాగ్ ని చాలా రోజుల తర్వాత చూసాను. అరె ఇక్కడొక డ్రాఫ్ట్ ఉందే అని చూస్తే పోస్ట్ చెయ్యడానికి రెడీగా కనిపించింది. . ఇలా గుర్తుచేసుకునే అవకాశం వచ్చినందుకు బోల్డు ఆనందంగానూ, ఈ మధ్యనే మా 'ఇంటెల్లేడీ'ని కోల్పోయినందుకు బోల్డు దుఖం గానూ ఉంది)